కాఫీ విత్…ఆర్.రమాదేవి పొయెట్రీ..812.
*అబద్ధాన్ని నిజమని ఒట్టేసి చెప్పడం బాగుంటుంది..!
అవును అతగాడొస్తే బాగుంటుంది.ఎప్పుడొచ్చేది
తెలిస్తే ఇంకా బాగుంటుంది..కాను తెలిసేదెలా..?
రమాదేవి అనుమానం ఇది.? నిజమే కదా! తెలిసే
దెలాగో..తేలుసుకునే ముందు మీరూ ఈ కవిత
చదవండి..!!
”నువ్వు వస్తే బాగుంటుంది
వచ్చే సమయం తెలిస్తే
ఇంకా బాగుంటుంది
నీకోసం
ఎదురు చూడటం లేదని
అబద్ధం చెప్పడం బాగుంటుంది
అబద్ధాన్ని నిజమని ఒట్టేసి చెప్పడం
ఇంకా బాగుంటుంది...
నువ్వు రాని ప్రతిసారి
రాలేదేమని ప్రశ్నించకుండా
మనసు ఖాళీతనాన్ని
దాచడం బాగుంటుంది..
నా నీడలో
నిన్ను దాచేసానని తెలియక
అసహనం ప్రకటిస్తావు చూడు
అది మరింత బాగుంటుంది..
ఓయ్... రాజకుమారా
ఎంత దూరాన ఉంటేనేం
కనపడిన దారులు వెతికి
నిన్ను కట్టివేయడం వచ్చు కదా
బావుంటుంది ...
ఇంకా బాగుంటుంది”!
*ఆర్.రమాదేవి..!!
అతగాడుంటే బాగుంటుంది.మరి అతగాడు చేంత లేడే? మరెలా? అతగాడొస్తే బాగుండు? ఆ వచ్చే..
సమయం తెలీస్తే ఇంకా బాగుండు.కానీ తెలీదే!మరి
తెలిసేదెలా? ఈ చిక్కుముడి వీడేదెలా?
అతగాడిప్పుడిక్కడ లేడు..వుంటే బాగుంటుంది.
మరిక్కబ వుండాలంటే అతగాడు రావాలికదా!
రావడం లేదు..ఎంతకూ రావడం లేదు.ఎదురు
చూసీ చూసీ విసుగు పుడుతోంది..
అయినా…
ఎదురు చూడటం లేదని అబద్ధం చెప్పడం ఆమెకు బాగుంటుంది..అబద్ధాన్ని నిజమని ఒట్టేసి చెప్పడం
ఇంకా బాగుంటుంది.అతగాడు రాని ప్రతిసారీ రాలేదేమని ప్రశ్నించకుండా మనసు ఖాళీతనాన్ని దాచడం ఆమెకు బాగుంటుంది..!
మరి రాడనుకున్నవాడు రాడన్న నిజం కంటే… వస్తాడన్న అబద్దం బాగుంటుందికదా! ఆ సాకుతో అయినా, అతగాడి జ్ఞాపకాల్లో ఇంకొంత సేపు గడిపెయ్యొచ్చు అన్నది ఆమె ఆశ.. అంతరంగం..!!
ఇంతకూ…అతగాడెక్కడ?
ఇంకెక్కడ…?
అతగాడ్ని తన నీడలో దాచేసిందామె..ఆ విషయం తెలీని అతగాడు అసహనం ప్రకటిస్తాడు.అలా..
అతడు అసహనం ప్రకటించడం ఆమెకు బాగుంటుందట..బాగుందికదా! ఈ ఇద్దరి మధ్య దోబూచులాట.!
“ఓయ్.! .. రాజకుమారా !
“నువ్వు ఎంత దూరాన ఉంటేనేం? కనపడిన దారులు వెతికి నిన్ను కట్టేయడం నాకు తెలిసిన విద్యే..
అలా నిన్ను కట్టిపడేయటం భలే తమాషాగా వుంటుంది”....ఇది ఆమె ఉవాచ..
అతగాడెక్కడో లేడు.ఆమె నీడలోనే వున్నాడు..ఆమెతోనే వున్నాడు..అమెలోనే వున్నాడు.కానీ,
ఈ విషయం అతగాడికి తెలియలేదు.కాలం ఇలా ఇద్దరితో ఆడుకుంటోంది.
ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నట్టు..,నిజం అబద్ధంగా
అబద్ధం నిజంగా భావించడం ఓ ఫాంటసీ..ప్రేమికుల
లోకంలో ఈ ఫాంటసీనే రాజ్యమేలుతుంటుంది.
*ఎ.రజాహుస్సేన్..!!